Narendra Modi: 25 ఏళ్లుగా అధికారంలో.. ప్రభుత్వాధినేతగా ప్ర‌ధాని మోదీ సరికొత్త రికార్డు

Narendra Modi Surpasses 25 Years as Government Leader
షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో ఓ చారిత్రక మైలురాయిని అందుకున్నారు. ఎన్నికైన ప్రభుత్వానికి అత్యధిక కాలం అధినేతగా పనిచేసిన వ్యక్తిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ప్రజా జీవితంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఆయన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం సీఎంగా 8,930 రోజులు పదవిలో కొనసాగగా, నరేంద్ర మోదీ ఆ రికార్డును దాటి 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా ఆయన పనిచేసిన కాలాన్ని కలిపి ఈ ఘనత సాధించారు. ఈ అరుదైన మైలురాయి ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి, నిరంతర ప్రజాసేవకు నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సీఎంగా, పీఎంగా అత్యధిక కాలం
నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 2014 మే 21 వరకు, దాదాపు 13 ఏళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగి, గుజరాత్‌కు అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా నిలిచారు. అనంతరం 2014 మే 26న 14వ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా, వరుసగా 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నేతగా ఆయనకు పలు రికార్డులు ఉన్నాయి. పూర్తి మెజారిటీ సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా, రెండు పూర్తి పదవీకాలాలు పూర్తిచేసి మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా ఆయన ఘనత సాధించారు.

సోషల్ మీడియాలోనూ పలు మైలురాళ్లు
రాజకీయ రికార్డులతో పాటు, డిజిటల్ ప్రపంచంలోనూ మోదీ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ ఏడాది ఆయన సోషల్ మీడియాలోనూ పలు మైలురాళ్లను దాటారు. ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్‌లో 3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుని, ప్రపంచ నేతల్లో అగ్రస్థానంలో నిలిచారు. గత ఫిబ్రవరిలో ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల మంది ఫాలోవర్లను దాటిన తొలి ప్రపంచ నేతగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయనకు ఇన్‌స్టాలో 10.1 కోట్ల మంది, ఎక్స్ (ట్విట్టర్) లో 10.64 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Go Back to Shorts
Narendra Modi
Prime Minister Modi
longest serving head of government
Pawan Kumar Chamling
Gujarat CM
Indian politics
social media
YouTube subscribers
Instagram followers
BJP

More Telugu News