Rythu Bharosa: తెలంగాణ రైతులకు డబుల్ గుడ్‌న్యూస్.. రైతు భరోసా నిధుల విడుదల‌తో పాటు కొత్త పరిశ్రమ ప్రారంభం

Revanth Reddy Announces Rythu Bharosa Funds Release New Oil Palm Factory for Telangana Farmers
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకే రోజు రెండు శుభవార్తలు అందించింది. పంట పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం నిధులను నేడు విడుదల చేయ‌నుంది. దీంతో పాటు సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సభా వేదిక నుంచే రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం రూ.9,000 కోట్లను సిద్ధం చేసింది.

మూడు విడతల్లో పెట్టుబడి సాయం
రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న 24.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నారు. ఇందుకోసం రూ.3,590 కోట్లను ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా బ్యాంకులకు బదిలీ చేయ‌నుంది. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం నుంచి ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీని తర్వాత సుమారు ఇరవై రోజుల వ్యవధిలో రెండో విడతగా రూ.2,650 కోట్లు, చివరి విడతలో రూ.2,760 కోట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఆయిల్ పామ్ రైతులకు భరోసా
నర్మెటలో నూతన ఆయిల్ పామ్ కర్మాగారం అందుబాటులోకి రానుండటంతో ఉత్తర, దక్షిణ తెలంగాణలోని 18 జిల్లాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పరిశ్రమలోనే రూ.80 కోట్లతో రిఫైనరీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పూర్తయితే పామాయిల్‌ను స్థానికంగానే ఉత్పత్తి చేసి, మార్కెటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది చివరి నాటికి ఖమ్మం, ములుగు, పెద్దపల్లి, వనపర్తి, గద్వాల జిల్లాల్లో మరో ఆరు కొత్త ఫ్యాక్టరీలు అందుబాటులోకి వస్తాయని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

పంటల మార్పిడికి బోనస్?
ఇదే సమయంలో రాష్ట్రంలో పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండి, కొరతగా ఉన్న పంటలను పండించే రైతులకు బోనస్ ఇవ్వాలని యోచిస్తోంది. ఇప్పటికే సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం.. ఆయిల్ పామ్‌తో పాటు ఇతర నూనెగింజలు, పప్పుధాన్యాలు, మొక్కజొన్న వంటి పంటలకు కూడా ప్రోత్సాహకాలు అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై నేటి సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది.
Go Back to Shorts
Rythu Bharosa
Revanth Reddy
Telangana farmers
Oil Palm factory
Crop investment scheme
Narmetta
Siddipet
Crop diversification
Agriculture bonus
Telangana agriculture

More Telugu News