High Court: జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణ పనులకు హైకోర్టు బ్రేక్

High Court Stays Jubilee Hills Road Expansion
షార్ట్స్‌లో చూడండి
నగరంలోని బంజారాహిల్స్ విరించి ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు చేపట్టాలనుకున్న రోడ్డు విస్తరణ పనులకు హైకోర్టు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది. ఈ ప్రాజెక్టు కోసం జీహెచ్‌ఎంసీ చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి చర్యలన్నీ వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.

విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భూసేకరణ చట్టం సెక్షన్ 21 ప్రకారం బాధితులకు నోటీసులు జారీ చేసేంత వరకు వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని అభిప్రాయపడింది. మార్చి 6న జారీ చేసిన నోటిఫికేషన్‌లో పునరావాస ప్రాంతం గురించి ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టింది. భూసేకరణ నోటిఫికేషన్‌ను కేవలం వెబ్‌సైట్‌లో కాకుండా, ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న రెండు దినపత్రికల్లో (ఒకటి తప్పనిసరిగా తెలుగు పత్రిక అయి ఉండాలి) ప్రచురించాలని సూచించింది.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ విభాగం రోడ్డు విస్తరణ ప్రణాళికను పునఃసమీక్షిస్తున్నట్లు తెలిసింది. కోర్టు సూచించిన విధంగా చట్టపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్లేందుకు, ప్రముఖ తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ కేసులో దెబ్బతింటున్న ఆస్తుల వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.
Go Back to Shorts
High Court
Jubilee Hills
Road Expansion
GHMC
Banjara Hills
Land Acquisition
Telangana
Hyderabad
Court Order
NV Shravan Kumar

More Telugu News