మూడో రోజు కూడా ధురంధర్-2 కలెక్షన్ల జోరు

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్, కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా సుమారు రూ.260 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళుతోంది.

విడుదలకు ముందే పెయిడ్ ప్రీవ్యూల ద్వారా రూ.43 కోట్లు రాబట్టిన ఈ సినిమా, తొలిరోజైన గురువారం ఏకంగా రూ.102.55 కోట్లు వసూలు చేసి బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ల రికార్డు సృష్టించింది. రెండో రోజు (శుక్రవారం) రూ.80.72 కోట్లు సాధించగా, మూడో రోజైన శనివారం సాయంత్రానికే రూ.87 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 260 కోట్ల మార్కును దాటింది.

ఈ వసూళ్లతో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' సినిమా ఓపెనింగ్ వీకెండ్ రికార్డును 'ధురంధర్ 2' సునాయాసంగా అధిగమించినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పాజిటివ్ టాక్, వీకెండ్ కావడంతో థియేటర్ల ఆక్యుపెన్సీ శనివారం నాడు 78 శాతానికి పైగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం తొలి రెండు రోజుల్లోనే రూ.333 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి సత్తా చాటింది. ఈ వసూళ్లలో హిందీ వెర్షన్ సింహభాగం వాటాను దక్కించుకోగా, తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్ 'జస్కీరత్ సింగ్ రంగి' అనే స్పై పాత్రలో కనిపించారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


More Telugu News