నిధుల దుర్వినియోగం.. అమెరికాలో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి జార్జ్

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఒక హైప్రొఫైల్ ప్రచార నిధుల కేసులో, భారత సంతతికి చెందిన ఒక కౌంటీ న్యాయమూర్తి దోషిగా తేలారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఆయనపై నమోదైన అభియోగాలు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు జ్యూరీ ఆయనను దోషిగా తేల్చుతూ తీర్పును వెలువరించింది. శిక్షను జూన్ 16న ఖరారు చేయనుంది. అయితే టెక్సాస్ చట్టం ప్రకారం శిక్ష ఖరారయ్యే వరకు ఆయన పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది.

భారత సంతతికి చెందిన కేపీ జార్జ్ టెక్సాస్‌లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ప్రచార నిధులను ఆయన వ్యక్తిగత అవసరాల కోసం దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. జార్జ్ ప్రచార ఖాతా నిధి నుంచి 46,000 డాలర్లకు పైగా వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి ఆ డబ్బును ఇంటి సంబంధిత చెల్లింపులు, వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో ఇటీవల ఆయనను కోర్టు గది నుంచి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక జైలు నుంచి పూచీకత్తుపై ఆయన బయటకు వచ్చారు. అమెరికా చట్టాలను అనుసరించి ఆయనకు రెండేళ్ల నుంచి పదేళ్ల జైలు శిక్ష, పదివేల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 


More Telugu News