ఎల్పీజీ కేటాయింపు పెంచుతున్నాం... హోటళ్లకు ఇవ్వండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ

వాణిజ్య సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్లను అదనంగా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వాణిజ్య గ్యాస్ కొరతను అధిగమించడానికి చర్యలు చేపట్టిన కేంద్రం, ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లలో అదనంగా 20 శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఈ చర్యతో ఓవరాల్ కేటాయింపులు 50 శాతానికి చేరుకున్నట్టయింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖ రాశారు.

వాణిజ్య సిలిండర్లకు సంబంధించి హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, సబ్సిడీ ఆహార కేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఆహార కేంద్రాలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. చమురు కంపెనీల వద్ద రిజిస్టర్ అయిన వాణిజ్య సంస్థలతో పాటు పీఎన్‌జీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటికి ఈ అదనపు కేటాయింపులు వర్తిస్తాయని తెలిపింది.

వలస కూలీలకు 5 కిలోల సిలిండర్లు అందజేయాలని, వాటిని సరఫరా చేస్తామని సూచించింది. ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిణీ చేస్తామని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్రం తెలిపింది. సిలిండర్లు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని ఆదేశించింది.


More Telugu News