జీవన్ రెడ్డి నివాసంలో 'బ్రేక్ ఫాస్ట్' రాజకీయం: మంత్రుల బుజ్జగింపులు ఫలించేనా?

దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను పోషించిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని దారికి తెచ్చుకునేందుకు అధికార పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ ఫిరాయింపులు, వలస నేతల ప్రాధాన్యతపై రగిలిపోతున్న జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రుల బృందం రంగంలోకి దిగింది. ఈ ఉదయం ఆయన నివాసంలో జరిగిన ఈ భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పిలుపును కూడా తిరస్కరించిన జీవన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన ఇంటికి వెళ్లారు. మీడియాను లోపలికి అనుమతించకుండా, అల్పాహారం చేస్తూ సుమారు గంటన్నర పాటు జీవన్ రెడ్డితో వీరు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.


"నేటి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా లేదు" అని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మంత్రుల ముందే తన ఆవేదనను వెళ్లగక్కినట్లు సమాచారం. సొంత పార్టీ నేతలకు అన్యాయం చేస్తూ, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పెద్దపీట వేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రులు ఎంత బతిమాలినా జీవన్ రెడ్డి మెత్తబడినట్లు కనిపించడం లేదని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ పార్టీని వీడాలని ఆయన ఇప్పటికే తన నిర్ణయాన్ని తీసేసుకున్నారని తెలుస్తోంది.


ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన పదవులకు కూడా జీవన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఉగాది తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పిన ఆయన, బీఆర్ఎస్ వైపు వెళ్తారా? లేక స్వతంత్రంగా ఉంటారా? అనేది సస్పెన్స్‌గా మారింది.



More Telugu News