ఏనుగుల మందకు దారిచ్చాడు.. ఊహించని రీతిలో కృతజ్ఞత తెలిపిన ఏనుగు.. వీడియో ఇదిగో!

జంతువులకు కూడా కృతజ్ఞతా భావం ఉంటుందని నిరూపించే ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఏనుగుల గుంపు రోడ్డు దాటేందుకు సహకరించిన ఓ వ్యక్తికి, ఆ మందలోని ఓ గజరాజు తొండమెత్తి అభివాదం చేసిన దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.

అడవి మార్గంలో వెళ్తున్న ఏనుగుల గుంపు రోడ్డు దాటేందుకు ప్రయత్నించడాన్ని ఓ వాహనదారుడు గమనించాడు. వెంటనే తన వాహనాన్ని ఆపి, వెనుక వస్తున్న ఇతర వాహనాలను కూడా నిలిపివేశాడు. గజరాజుల మంద అంతా సురక్షితంగా రోడ్డు దాటే వరకు ఓపికగా ఎదురుచూశాడు.

మంద అంతా రోడ్డు దాటిన తర్వాత అందులోని ఓ పెద్ద ఏనుగు వెనక్కి తిరిగి తమకు సహకరించిన ఆ వ్యక్తి వైపు చూస్తూ, గౌరవంగా తన తొండాన్ని పైకి ఎత్తి ఊపింది. ఈ దృశ్యం చూసిన వారికి అది మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా అనిపించింది.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జంతువుల పట్ల ప్రేమ చూపిన వ్యక్తిని, కృతజ్ఞత చాటుకున్న ఏనుగును నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మూగజీవాలకు కూడా మనలాగే భావోద్వేగాలు ఉంటాయని, వాటి తెలివితేటలను తక్కువ అంచనా వేయకూడదని ఈ సంఘటన నిరూపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.


More Telugu News