బాగ్దాద్‌ను కమ్మేసిన దట్టమైన పొగ.. అమెరికా స్థావరంపై రాకెట్ల వర్షం

అమెరికా, ఇరాన్ మధ్య రాజుకుంటున్న ఉద్రిక్తతలు ఇరాక్‌ను తాకాయి. రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని అమెరికా దౌత్య, లాజిస్టిక్ కేంద్రంపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దౌత్య కార్యాలయం అగ్నిప్రమాదానికి గురైంది. దాడి తీవ్రతకు దట్టమైన నల్లటి పొగ కిలోమీటర్ల మేర ఆకాశంలోకి ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

గత కొంతకాలంగా బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, సైనిక స్థావరాలపై రాకెట్లు, డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన దాడికి 'అషాబ్ అల్-కహ్ఫ్' అనే ఇరాన్ మద్దతు ఉన్న గ్రూప్ బాధ్యత స్వీకరించింది. మరోవైపు, 'కతైబ్ హిజ్బుల్లా' అనే మరో శక్తిమంతమైన గ్రూప్ కీలక ప్రకటన చేసింది. నివాస ప్రాంతాలపై అమెరికా దాడులు నిలిపివేస్తే, తాము ఐదు రోజుల పాటు దాడులు ఆపుతామని షరతు విధించింది.

అమెరికా తన కేంద్రాల రక్షణకు 'C-RAM' వంటి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. వీటి ద్వారా చాలా డ్రోన్లను గాలిలోనే కూల్చివేస్తున్నప్పటికీ, కొన్ని లక్ష్యాలను ఛేదించడంతో ఆస్తి నష్టం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి ఇరాన్‌ అనుకూల గ్రూపులు ఇరాక్‌లోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

ఇరు దేశాల ఆధిపత్య పోరులో ఇరాక్ యుద్ధ క్షేత్రంగా మారుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దాడులు జరగడంతో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ భయానక పరిస్థితుల నేపథ్యంలో, తమ పౌరులు తక్షణమే ఇరాక్ విడిచి వెళ్లాలని అమెరికా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.


More Telugu News