కోట్లాది ఐఫోన్ యూజర్లకు 'డార్క్‌స్వోర్డ్' ముప్పు

ఐఫోన్ అంటే అత్యంత భద్రమైన ఫోన్ అనే నమ్మకానికి గట్టి దెబ్బ తగిలింది. 'డార్క్‌స్వోర్డ్' అనే అత్యంత ప్రమాదకరమైన స్పైవేర్ ఇప్పుడు ఐఫోన్ వినియోగదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోట్లాది ఐఫోన్లను ఇది క్షణాల్లో హ్యాక్ చేయగలదని గూగుల్ సహా పలు సైబర్ భద్రతా సంస్థల పరిశోధనలో వెల్లడైంది.

సాధారణంగా ఏదైనా లింక్‌పై క్లిక్ చేస్తే మాల్‌వేర్ వస్తుందని భావిస్తాం. కానీ ఈ స్పైవేర్ మరింత తెలివిగా పనిచేస్తోంది. ప్రభుత్వ లేదా ఇతర నమ్మకమైన వెబ్‌సైట్లను సందర్శించినప్పుడు, వాటిలో హ్యాకర్లు ముందుగా చొప్పించిన కోడ్ ద్వారా ఇది నేరుగా ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. ఒక్కసారి ఫోన్‌లోకి చేరితే ఫొటోలు, వ్యక్తిగత మెసేజ్‌లు, చివరికి క్రిప్టోకరెన్సీ వాలెట్లను సైతం ఖాళీ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌదీ అరేబియా, ఉక్రెయిన్ వంటి దేశాల్లోని ప్రముఖుల డేటా చోరీకి దీనిని ఉపయోగించినట్లు గుర్తించారు.

ముఖ్యంగా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు వాడుతున్న ఐఫోన్లకు ఈ 'డార్క్‌స్వోర్డ్' స్పైవేర్ నుంచి ముప్పు ఎక్కువగా ఉంది. iOS 18, అంతకంటే పాత వెర్షన్లపై ఇది సులభంగా దాడి చేయగలదని తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్లలో దాదాపు 25 శాతం ఫోన్లు ఇప్పటికీ పాత సాఫ్ట్‌వేర్‌తోనే నడుస్తున్నాయని, వారందరూ హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఐఫోన్ భద్రతను హ్యాకర్లు సవాల్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో 'ఎయిర్‌ప్లే' ఫీచర్‌లోని లోపాలను, యూఎస్‌బీ కనెక్షన్లను ఆసరాగా చేసుకొని కూడా హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన 'డార్క్‌స్వోర్డ్', 'కరోనా' వంటి స్పైవేర్లు ఈ ముప్పును మరింత తీవ్రతరం చేశాయి. ఈ నేపథ్యంలో తమ ఐఫోన్‌లోని విలువైన సమాచారాన్ని కాపాడుకోవాలంటే, వినియోగదారులు వెంటనే తమ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవడం ఒక్కటే మార్గమని సైబర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.


More Telugu News