టీడీపీలో విషాదం.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత

టీడీపీ సీనియర్‌ నేత, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే టీడీపీ శ్రేణులు, నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

హనుమంతరాయ చౌదరి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి గారి మరణం బాధ కలిగించింది. పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. నిబద్ధతతో ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటు" అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చౌదరి అంత్యక్రియలు ఆదివారం ఉదయం ఆయన స్వగ్రామమైన ఎర్రంపల్లిలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఉన్నం రాజ‌కీయ ప్ర‌స్థానం
హనుమంతరాయ చౌదరి తన రాజకీయ జీవితాన్ని కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామ సర్పంచ్‌గా ప్రారంభించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ టీడీపీలో కీలక నేతగా మారారు. టీడీపీ మండల అధ్యక్షుడిగా, సింగిల్‌ విండో అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1998 నుంచి 2004 వరకు మార్ఫెడ్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. దాదాపు పదేళ్లపాటు (2000-2010) అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ, 2014 ఎన్నికల్లో కళ్యాణదుర్గం అసెంబ్లీ టికెట్‌ కేటాయించగా, ఆయన పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కనప్పటికీ, పార్టీకి విధేయుడిగా కొనసాగారు. 2024 ఎన్నికల్లో తనకు లేదా తన కుమారుడు మారుతి చౌదరికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. అయితే, ఆ ఎన్నికల్లో అమిలినేని సురేంద్రబాబుకు అవకాశం లభించింది. అయినప్పటికీ, హనుమంతరాయ చౌదరి పార్టీ నిర్ణయానికి కట్టుబడి, టీడీపీలోనే కొనసాగారు. ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు వీరేశ్‌ చౌదరి, మారుతి చౌదరి, ఉదయభాస్కర్‌ చౌదరి ఉన్నారు.


More Telugu News