సోషల్ మీడియా ప్రచారాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి: మంత్రి నాదెండ్ల
- రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్
- సోషల్ మీడియా అపోహలతోనే అధిక బుకింగ్స్ అని వెల్లడి
- ఆసుపత్రులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాలో తొలి ప్రాధాన్యమన్న మంత్రి నాదెండ్ల
సోషల్ మీడియాలో కొందరు సృష్టిస్తున్న వదంతుల వల్లే ప్రజలు ఆందోళనకు గురై అధికంగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. దీనివల్లే కృత్రిమ కొరత ఏర్పడుతోందన్నారు. గత వారం రోజుల్లోనే ఇలాంటి బుకింగ్స్ పెరిగాయని, సెప్టెంబర్ 14న 5.04 లక్షలుగా ఉన్న బుకింగ్స్ ఇప్పుడు 2.96 లక్షలకు తగ్గాయని వివరించారు. రాష్ట్రంలో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేస్తున్నాయని చెప్పారు.
వాణిజ్య అవసరాలకు సంబంధించి ఆసుపత్రులు, పాఠశాలలు, వసతి గృహాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, క్రమంగా సరఫరా మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు ఉల్లంఘించిన 6 నుంచి 9 ఏజెన్సీలపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మోసాలకు తావులేకుండా 100 శాతం ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.
పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు సోమవారంలోగా కొత్త పాలసీ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, త్వరలోనే రాష్ట్రంలో కిరోసిన్ సరఫరాను పునఃప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ముందుగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.