సోషల్ మీడియా ప్రచారాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి: మంత్రి నాదెండ్ల

రాష్ట్రంలో గృహ అవసరాలకు సరిపడా వంట గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని, అయితే సోషల్ మీడియాలో ప్రచారాలు భయాందోళన కల్గిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గ్యాస్ కొరతపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపోహలను నమ్మవద్దని, భయాందోళనలకు గురి కావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్న కానూరులోని సివిల్ సప్లైస్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

సోషల్ మీడియాలో కొందరు సృష్టిస్తున్న వదంతుల వల్లే ప్రజలు ఆందోళనకు గురై అధికంగా సిలిండర్లు బుక్ చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. దీనివల్లే కృత్రిమ కొరత ఏర్పడుతోందన్నారు. గత వారం రోజుల్లోనే ఇలాంటి బుకింగ్స్ పెరిగాయని, సెప్టెంబర్ 14న 5.04 లక్షలుగా ఉన్న బుకింగ్స్ ఇప్పుడు 2.96 లక్షలకు తగ్గాయని వివరించారు. రాష్ట్రంలో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేస్తున్నాయని చెప్పారు.

వాణిజ్య అవసరాలకు సంబంధించి ఆసుపత్రులు, పాఠశాలలు, వసతి గృహాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని, క్రమంగా సరఫరా మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం మోపుతామని, నిబంధనలు ఉల్లంఘించిన 6 నుంచి 9 ఏజెన్సీలపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. మోసాలకు తావులేకుండా 100 శాతం ఓటీపీ ఆధారిత డెలివరీ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.

పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు సోమవారంలోగా కొత్త పాలసీ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, త్వరలోనే రాష్ట్రంలో కిరోసిన్ సరఫరాను పునఃప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ముందుగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్లు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.


More Telugu News