తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీటీడీ అధికారులు

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తిరుమల చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ శుక్రవారం సాయంత్రమే తిరుమల చేరుకోగా, లోకేశ్ కాస్త ఆలస్యంగా వచ్చారు. రేపు (మార్చి 21) ఆయన కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు వారు తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఒక రోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను నారా కుటుంబం విరాళంగా ఇవ్వనుంది.

అంతకుముందు, తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు. అక్కడ ఆయనకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర అధికారులు, నేతలు స్వాగతం పలికారు.

ఈ రోజు రాత్రి నారా కుటుంబం తిరుమలలోని గాయత్రీ అతిథి గృహంలో బస చేస్తుంది. శనివారం ఉదయం దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదని, దేవాన్ష్ పుట్టినరోజును ఏటా తిరుమలలో జరుపుకోవడం ఆనవాయతీగా వస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు.


More Telugu News