అదో కాగితపు పులి.. పిరికివాళ్లు: నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం

హర్మూజ్ జలసంధిని తెరవడానికి ముందుకు రావాలని తాను చేసిన విజ్ఞప్తిని నాటో దేశాలు పట్టించుకోకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటో దేశాల వ్యవహారశైలిపై తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా చిందులు వేశారు. అమెరికా లేని 'నాటో' ఓ కాగితపు పులి అని, అమెరికా లేకుండా ఏమీ చేయలేదని మండిపడ్డారు. ఇరాన్‌పై యుద్ధంలో చేరనందుకు, హర్మూజ్ జలసంధిని తెరవడంలో సహకరించనందుకు వారిని గుర్తించుకుంటామని హెచ్చరిక చేశారు.

"అమెరికా లేకుండా నాటో ఒక పేపర్ టైగర్ వంటిదే. అణ్వాయుధాలు కలిగిన ఇరాన్‌ను ఆపడానికి జరుగుతున్న యుద్ధంలో వారు చేరడానికి ఇష్టపడటం లేదు. కానీ తక్కువ నష్టంతో మా సైన్యం విజయం సాధించింది. అయినప్పటికీ నాటో దేశాలు ఇప్పుడు తాము చెల్లించవలసి వస్తున్న అధిక చమురు ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. కానీ అధిక చమురు ధరలకు కారణమైన హర్మూజ్ జలసంధిని తెరవడానికి నాటో దేశాలు ఇష్టపడటం లేదు. ఒక సాధారణ సైనిక విన్యాసం ద్వారా హర్మూజ్ జలసంధిని తెరవొచ్చు. కానీ సహకరించేందుకు వారు ముందుకు రావడం లేదు. వారు పిరికివాళ్లు, వారిని గుర్తుంచుకుంటాం" అని ట్రంప్ హెచ్చరించారు.


More Telugu News