పాన్ వ్యసనమే శ్రీహరి ప్రాణం తీసిందా? సుద్దాల అశోక్ తేజ ఏం చెప్పారంటే...!

టాలీవుడ్ ప్రేక్షకులకు 'మగధీర' షేర్ ఖాన్ గా, పేదల పాలిట పెన్నిధిగా సుపరిచితుడైన దివంగత నటుడు శ్రీహరి మరణం ఇప్పటికీ ఒక తీరని లోటు. అయితే, అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా, కండలు తిరిగిన శరీరంతో ఉన్న శ్రీహరి.. ఒక్కసారిగా సన్నబడి మరణించడానికి గల కారణాన్ని గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ బయటపెట్టారు. శ్రీహరి మృతికి ఆయనకు ఉన్న పాన్ తినే అలవాటే ప్రధాన కారణమని అశోక్ తేజ తెలిపారు.


సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ... "'మేస్త్రి' సినిమా సమయానికి శ్రీహరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అంతకుముందు 'భద్రాచలం' సినిమాలో ఎంతో పుష్టిగా, బలంగా కనిపించిన ఆయన... ఆ తర్వాత చాలా సన్నబడ్డారు. అతిగా పాన్ తినడం వల్లే ఆయన కాలేయం తీవ్రంగా దెబ్బతిన్నదని, అదే ఆయన మరణానికి దారితీసిందని మాకు తర్వాత తెలిసింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.


శ్రీహరి కేవలం నటుడే కాదు, తోటి కళాకారులను ఆదుకునే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కూడా అని సుద్దాల గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో సినీ పరిశ్రమలో అవకాశాలు లేక, నిరాశతో తిరిగి తన పాత ఉద్యోగానికి వెళ్లిపోవాలని సుద్దాల నిర్ణయించుకున్నారట. ఆ సమయంలో శ్రీహరి చేసిన సహాయం మరువలేనిదని ఆయన తెలిపారు. "నీ ఆర్థిక పరిస్థితి నాకు అర్థమవుతోంది. నువ్వు సెట్ అయ్యే వరకు నెలకు రూ. 10 వేలు పంపిస్తాను. ఇండస్ట్రీ వదిలి వెళ్ళకు. నేను హీరోగా 17 సినిమాలకు సైన్ చేశా. ప్రతి సినిమాలో నీకు కచ్చితంగా ఒక పాట ఉంటుంది" అని శ్రీహరి తనకు చెప్పారని వెల్లడించారు. ఆయన నుంచి తాను డబ్బు తీసుకోకపోయినా... ఆయన ఇచ్చిన భరోసా తన జీవితం ముందుకు సాగడానికి ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పారు.


శ్రీహరి ఇచ్చిన ఆ ధైర్యమే 'భద్రాచలం' సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన "ఒకటే జననం ఒకటే మరణం" పాటకు స్ఫూర్తి అని సుద్దాల తెలిపారు. బాలానగర్‌లో పాలు అమ్ముకుంటూ పేదరికం నుంచి ఎదిగిన శ్రీహరి, తన చివరి శ్వాస వరకు పేదల కోసం, తోటి కళాకారుల కోసం పరితపించారని ఆయన కొనియాడారు.


More Telugu News