ఇది కుంభకోణాల పద్దు.. మహిళలు, రైతులను కాంగ్రెస్ నిలువునా ముంచింది: జగదీశ్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ముప్పేట దాడికి దిగింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ బడ్జెట్ ప్రజలందరినీ వంచించేలా ఉందని, అందరి చెవిలో పూలు పెట్టే ప్రయత్నాన్ని రేవంత్ సర్కార్ చేస్తోందని మండిపడ్డారు.


ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారని... ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని దుయ్యబట్టారు. ఇది ఆడబిడ్డలను నట్టేట ముంచడం కాదా? అని ప్రశ్నించారు.


రైతు భరోసాపై నమ్మక ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు. కనీసం పాత పద్ధతిలో ఇవ్వాల్సిన రూ. 12 వేలు అయినా ఎప్పుడు ఇస్తారో కూడా బడ్జెట్‌లో స్పష్టత లేదని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాట ఉత్తమాటగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


వృద్ధులు, వికలాంగుల ఆశలపై కూడా ప్రభుత్వం నీళ్లు చల్లిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. "వృద్ధులకు రూ. 4 వేలు, వికలాంగులకు రూ. 6 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మౌనంగా ఉండటం దారుణం. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ బడ్జెట్‌లో చిన్న కేటాయింపు కూడా లేదు" అని ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్ ప్రజల అభివృద్ధి కోసం కాదని, కేవలం కాంగ్రెస్ నేతలు కుంభకోణాలు చేసుకోవడానికే పనికొస్తుందని జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పక్కదారి పట్టించేందుకే అంకెల గారడీ చేస్తున్నారని విమర్శించారు.


More Telugu News