'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాశ్‌ రాజ్ సెటైర్

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'ధురంధర్ ది రివెంజ్'ను దక్షిణాది స్టార్ హీరోలు ప్రశంసించడంపై ఆయన పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రశంసల వెనుక ఉన్నది నిజమైన అభిమానమేనా, లేక ఇతర 'బాధ్యతలు' కూడా ఉన్నాయా? అనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు.  

వివరాల్లోకి వెళితే... రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన విష‌యం తెలిసిందే. సినిమాకు మంచి స్పందన వ‌చ్చింది. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్, మహేశ్‌ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వంటి పలువురు దక్షిణాది అగ్ర తారలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.

ఈ నేపథ్యంలో ఓ సోషల్ మీడియా యూజర్.. "నలుగురు పెద్ద సౌత్ స్టార్లు 'ధురంధర్'ను పొగిడారు. ఒక్క బాలీవుడ్ సెలబ్రిటీ అయినా ఈ సినిమా గురించి మాట్లాడారా?" అని ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. "ఈ 'బాధ్యతల' సంకేతాలు దక్షిణాదికి కూడా పాకుతున్నాయి.. #జస్ట్ఆస్కింగ్" అని కామెంట్ చేశారు.



More Telugu News