Gautam Gambhir: డీప్‌ఫేక్‌పై గంభీర్ న్యాయపోరాటం.. విచారణ వాయిదా

Delhi HC defers hearing on Gautam Gambhirs plea for protection of personality rights
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తన వ్యక్తిగత హక్కుల (పర్సనాలిటీ రైట్స్) పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను ఉపయోగించి డీప్‌ఫేక్ కంటెంట్ సృష్టిస్తున్నారని, డిజిటల్ మాధ్యమాల్లో తనను తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై ఇవాళ‌ విచారణ చేపట్టిన జస్టిస్ జ్యోతి సింగ్ బెంచ్, పిటిషన్‌లోని కొన్ని లోపాలను సరిచేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల‌ 23కు వాయిదా వేసింది.

గంభీర్ తన పిటిషన్‌లో 16 సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. వీరిలో మెటా, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ (యూట్యూబ్) వంటి సోషల్ మీడియా దిగ్గజాలతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కేంద్ర ఐటీ, టెలికాం శాఖలను కూడా ప్రతివాదుల జాబితాలో చేర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ సహాయంతో ఫేస్-స్వాపింగ్, వాయిస్-క్లోనింగ్ చేసి, తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంభీర్ ఆరోపించాడు.

ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వేదికలపై ఇలాంటి నకిలీ కంటెంట్ గణనీయంగా పెరిగిపోయిందని గంభీర్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. తాను రాజీనామా చేస్తున్నట్లుగా సృష్టించిన ఒక డీప్‌ఫేక్ వీడియోకు 29 లక్షలకు పైగా వ్యూస్ రాగా, ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్ల గురించి తాను వ్యాఖ్యానించినట్లు ఉన్న మరో నకిలీ వీడియోకు 17 లక్షల వ్యూస్ వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఈ తరహా కంటెంట్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న తన వృత్తికి, ప్రతిష్ఠ‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలతో పోస్టర్లు, ఇతర వస్తువులు అమ్ముతున్నారని కూడా గంభీర్ ఆరోపించాడు. తన గుర్తింపును ఆయుధంగా వాడుకుని కొందరు అజ్ఞాత వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొన్నాడు.

కాపీరైట్, ట్రేడ్‌మార్క్ చట్టాల కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో తన పేరు, ఫొటో, వాయిస్‌ను ఎలాంటి మాధ్యమంలోనైనా తన అనుమతి లేకుండా వాడకుండా శాశ్వత ఇంజంక్షన్ విధించాలని గంభీర్ కోరాడు. పరువు నష్టానికి పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని, అక్రమంగా సంపాదించిన లాభాల లెక్కలు సమర్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ కంటెంట్‌ను తొలగించాలని కూడా అభ్యర్థించాడు.

ఇటీవలి కాలంలో సునీల్ గవాస్కర్, శ్రీశ్రీ రవిశంకర్, నటులు నాగార్జున, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కాజోల్ వంటి అనేక మంది ప్రముఖులు తమ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Gautam Gambhir
Deepfake
Delhi High Court
Defamation
Social Media
AI
Artificial Intelligence
Copyright Infringement
Personality Rights
Fake Content

More Telugu News