సోషల్ మీడియా ట్రోల్స్‌కు మంత్రి లోకేశ్‌ కౌంటర్.. పూజగదిలోని ఆ బొమ్మ వెనుక కథ ఇదీ!

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఉగాది పర్వదినం సందర్భంగా సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఫొటో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పూజగదిలో కనిపించిన ఓ బొమ్మపై కొందరు నెటిజన్లు క్షుద్రపూజలంటూ ఆరోపణలు చేయడంతో లోకేశ్‌ స్వయంగా రంగంలోకి దిగి ఆ వాదనలను ఖండిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

తెలుగు ప్రజలంతా ఉగాది పండుగను కుటుంబసభ్యులతో కలిసి వైభవంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేశ్‌ కూడా తన నివాసంలో కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి పండుగ చేసుకుంటున్నానని, "నా ఛాంప్‌తో ఉగాది" అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ ఒక్కరోజు తన కఠినమైన డైట్‌కు విరామం ఇచ్చి పండుగ వంటకాలను ఆస్వాదిస్తానని పేర్కొంటూ, పూజగదిలోని కొన్ని ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేశారు.

అయితే, లోకేశ్‌ పంచుకున్న ఫొటోలలో ఒకటి వివాదానికి కేంద్ర బిందువైంది. పూజగదిలో దేవుడి పటాల పక్కన మట్టితో చేసినట్లుగా ఉన్న ఓ బొమ్మ కనిపించడంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. "పవిత్రమైన దేవుడి మందిరంలో క్షుద్రపూజలకు వాడే చేతబడి బొమ్మ ఎందుకు ఉంది?" అంటూ కొందరు నెటిజన్లు ఆయనను ప్రశ్నించారు. ఈ ఆరోపణలు వేగంగా వ్యాపించడంతో లోకేశ్‌ పూజగదిలో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఆరోపణలపై మంత్రి లోకేశ్‌ స్పందించారు. తన పూజగదిలోని బొమ్మ వెనుక ఉన్న అసలు కథను వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు. "మా పూజ గదిలోని బొమ్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం.. ఇది దేవాన్ష్ తన నాలుగేళ్ల వయసులో చేతితో తయారు చేసిన శివుని బొమ్మ. దాని పక్కన చిన్న శివలింగం ఉన్నాయి. దేవాన్ష్ శివుడిపై ఉన్న భక్తితో వీటిని తయారు చేశాడు. దానిని ఒక జ్ఞాపకంగా మేము పూజ గదిలో ఉంచాము" అని లోకేశ్‌ స్పష్టం చేశారు.

అనంతరం, "కొందరికి విశ్వాసం అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి వివరణ అవసరం లేదు. హరహరమహాదేవ్" అంటూ తన ట్వీట్‌ను ముగించారు. తన కుమారుడి సృజనను, భక్తిని క్షుద్రపూజలతో ముడిపెట్టడంపై ఆయన పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ వివరణతో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఆయన తెరదించే ప్రయత్నం చేశారు.


More Telugu News