కాకినాడ జిల్లాను వీడి పోలవరం జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి

కాకినాడ జిల్లాలో కొద్ది రోజులుగా కలకలం సృష్టిస్తున్న పెద్దపులి ఇప్పుడు పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. రాజవొమ్మంగి మండలం ఉర్లకులపాడు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు నిన్న ధ్రువీకరించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని బాపన్నదొర కొండల నుంచి బయలుదేరిన పులి, బవురువాక, తడువాయి అడవుల మీదుగా పోలవరం జిల్లా సరిహద్దులోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. పోలవరం డీఎఫ్‌వో శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక "హనుమాన్" బృందాలతో అధికారులు పులి కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. నాగులకొండ పర్వత శ్రేణిలో సుమారు 10 కిలోమీటర్ల మేర పులి పాదముద్రలను గుర్తించారు.

అయితే, పులి తాను వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత రెండు రోజులుగా పశువులపై ఎలాంటి దాడి జరగకపోవడం గమనార్హం. ముందుజాగ్రత్త చర్యగా ఉర్లకులపాడు, వెంకట్ నగర్, చెరువుకొమ్ముపాలెం, గొల్లవారి వీధి, కొత్తంపాలెం సహా 15కు పైగా గ్రామాలను అటవీ శాఖ అప్రమత్తం చేసింది. పులి జనావాసాల వైపు వస్తే పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
 


More Telugu News