వెరైటీ కోసం వెర్రి తలలు: నీటిపై తేలుతూ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో ఇదిగో!

ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ అంటే అందమైన లొకేషన్లు గుర్తుకొస్తాయి. కానీ, ట్రెండ్‌కు భిన్నంగా వెళ్లాలనే ఆలోచనతో ఓ జంట ఏకంగా బురద గుంటలో ఫోటోషూట్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్‌'లో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో, వధూవరులిద్దరూ బురదగుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది. ఇద్దరూ మురికి నీటిలో తేలుతూ ఫోజులిస్తుండగా, ఫోటోగ్రాఫర్లు వారికి సూచనలు ఇస్తూ కనిపించారు. అయితే ఈ దృశ్యం రొమాంటిక్‌గా కాకుండా, ఏదో క్రైమ్ సీన్‌ను తలపిస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, రీల్స్ కోసమే జంటలు ఇలాంటి వింత పోకడలకు పోతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వింత ఫోటోషూట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "ఇది ప్రీ-వెడ్డింగ్ షూటా లేక క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ ప్రోమోనా?" అని ఒకరు ప్రశ్నించగా, "డైరెక్టర్ టైటానిక్ రేంజ్‌లో ఫీల్ అవుతున్నట్టున్నాడు" అని మరొకరు ఎద్దేవా చేశారు.

అయితే, వెరైటీ కోసం చేసే ఇలాంటి ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. గతంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని నదుల్లో ఫోటోషూట్‌లు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అందమైన జ్ఞాపకాల కోసం చేసే ఫోటోషూట్‌లు ప్రాణాపాయ స్థితికి దారితీయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


More Telugu News