Iran: ఇరాన్ సముద్రగర్భ కేబుళ్లను టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటి?

Iran Threatens Internet Cables in Hormuz Strait
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధం ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు కొత్త ముప్పును తెచ్చిపెట్టింది. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిలో సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్నాయి. ఇది వాస్తవరూపం దాల్చితే గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రపంచ దేశాలపై దాని ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధితో పాటు ఎర్ర సముద్రం కూడా వాణిజ్య నౌకల రాకపోకలకు మూసుకుపోయింది. మార్చి 3న ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ), హర్మూజ్‌ను దాటే ప్రయత్నం చేసే ఏ నౌకనైనా కాల్చివేస్తామని హెచ్చరించింది. మరోవైపు, ఇరాన్‌కు మద్దతుగా హూతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో దాడులను పునఃప్రారంభించడంతో రెండు ప్రధాన సముద్ర మార్గాలు యుద్ధ క్షేత్రాలుగా మారాయి.

ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 95 శాతం సముద్రగర్భ కేబుళ్ల ద్వారానే నడుస్తుంది. ఆసియా, ఐరోపా, ఆఫ్రికాలను కలిపే 17 కీలక కేబుళ్లు ఒక్క ఎర్ర సముద్రం గుండానే వెళుతున్నాయి. అలాగే, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రైన్, ఖతార్ వంటి దేశాలను గ్లోబల్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తున్నాయి. భారతదేశ విదేశీ డేటా కనెక్టివిటీకి సైతం ఈ మార్గాలు అత్యంత కీలకం.

ఈ పరిణామాలు టెక్ దిగ్గజాల ప్రణాళికలను దెబ్బతీసేలా ఉన్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు గల్ఫ్ దేశాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టాయి. యూఏఈ, సౌదీ అరేబియాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌లుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇప్పుడు కేబుళ్లకు నష్టం వాటిల్లితే ఆ ప్రణాళికలు తలకిందులవుతాయి. ఈ కేబుళ్లు దెబ్బతింటే, వాటిని బాగు చేయడానికి ప్రత్యేక నౌకలు యుద్ధ ప్రాంతాలకు వెళ్లడం అసాధ్యం. దీంతో వారాలు, నెలల పాటు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం తప్పదు. 2024లో హమాస్-ఇజ్రాయెల్ ఘర్షణల సమయంలో హూతీలు ఎర్ర సముద్రంలో కేబుళ్లపై దాడి చేసినప్పుడు ఇదే పరిస్థితి ఎదురైంది.

ఇరాన్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో సీమైన్లు (సముద్ర మందుపాతరలు) అమర్చినట్టు సమాచారం. తమ భూభాగంలో అమెరికా సైన్యానికి ఆశ్రయం ఇస్తున్నందుకు గల్ఫ్ దేశాల కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 17 శాతం ఈ మార్గాల గుండానే వెళుతుంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఇంటర్నెట్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
Go Back to Shorts
Iran
Hormuz Strait
Internet cables
Red Sea
Israel
USA
Fiber optic cables
Global internet
Middle East conflict
Data connectivity

More Telugu News