చంద్రబాబు రాజనీతిజ్ఞుడు.. జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది: కోటంరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగ భృతి, పారిశ్రామిక ప్రగతిపై నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు.
గత 20 నెలల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు కోటంరెడ్డి వెల్లడించారు. రాష్ట్రానికి ఇప్పటివరకు సుమారు రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చామని, దీని ద్వారా లక్షలాది మందికి ప్రైవేటు రంగంలో ఉపాధి లభించనుందని ధీమా వ్యక్తం చేశారు.
కంప్యూటర్లు కూడు పెడతాయా? అని నాడు కొందరు విమర్శించారని... కానీ, నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారంటే అది చంద్రబాబు ముందుచూపే అని ప్రశంసించారు. గత ప్రభుత్వం అన్యాయంగా ఆయనను జైల్లో పెట్టినప్పుడు ఐటీ ఉద్యోగులంతా స్వచ్ఛందంగా మద్దతు తెలపడం ఆయన సంపాదించుకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.
సాధారణ రాజకీయ నేత ఓట్ల కోసం ఆలోచిస్తే, నిజమైన రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అదే కోవకు చెందుతారని, ప్రస్తుతం ఆయన క్వాంటమ్ వ్యాలీ వంటి అత్యాధునిక ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారని చెప్పారు. ఇదే పరిస్థితి మరో 15 ఏళ్లు కొనసాగితే, ఆంధ్రప్రదేశ్ చిత్రపటం అద్భుతంగా మారిపోతుందని, ప్రపంచ స్థాయికి రాష్ట్రం చేరుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీసిందని, రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో నష్టపోయిందని కోటంరెడ్డి విమర్శించారు. ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుతూ చంద్రబాబు ఈ వయసులో కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.