Pinnelli Ramakrishna Reddy: 99 రోజుల తర్వాత జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక!

YSRCP Leader Pinnelli Released Alleges Political Conspiracy
షార్ట్స్‌లో చూడండి

పల్నాడు రాజకీయాల్లో కీలక నేత, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, నేడు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు వెలుపల వైసీపీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.


జైలు నుంచి విడుదలైన అనంతరం పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై నమోదైన కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆయన మండిపడ్డారు. "వెల్దుర్తి మండలంలో జరిగిన టీడీపీ వర్గాల అంతర్గత గొడవలకు, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనలో నన్ను ఉద్దేశపూర్వకంగా నిందితుడిగా ఇరికించారు" అని ఆయన స్పష్టం చేశారు. నాడు జిల్లా ఎస్పీ సైతం ఈ ఘటనను ఇరువర్గాల మధ్య జరిగిన పోరుగా తేల్చినప్పటికీ, ప్రభుత్వం తనను అన్యాయంగా 99 రోజులు జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.


"భవిష్యత్తులో మాకు తప్పకుండా ఒక రోజు వస్తుంది. ఆరోజు దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ బయటకు లాగుతాం. రాజకీయ నాయకులైనా, అధికారులైనా సరే... చట్టం ముందు నిలబెట్టి తీరుతాం. ఎవరినీ వదిలిపెట్టే సమస్యే లేదు" అని ఆయన హెచ్చరించారు. పిన్నెల్లి విడుదలతో మాచర్ల, వెల్దుర్తి ప్రాంతాల్లోని వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే, ఇదే కేసులో ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి బెయిల్ నిరాకరించడంతో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు.
Go Back to Shorts
Pinnelli Ramakrishna Reddy
Pinnelli
YSRCP
Andhra Pradesh Politics
Palnadu
Guntur
Veldurthi
TDP
Political Vendetta
Nellore Central Jail

More Telugu News