Radhakrishnan Parthiban: క్షమాపణలు చెప్పిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విలన్.. కార‌ణ‌మిదే!

Radhakrishnan Parthiban Apologizes for Remarks at Ustaad Bhagat Singh Event
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన ప్రముఖ తమిళ నటుడు రాధాకృష్ణన్ పార్తిబన్, ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు తెలిపారు. అనుకోకుండా నోరు జారడం వల్లే అలా మాట్లాడానని, తనను క్షమించాలని కోరారు.

అసలేం జరిగిందంటే..!
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్ర ప్రచారంలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న పార్తిబన్, తనను తాను పరిచయం చేసుకుంటూ తన కులం పేరును ప్రస్తావించారు. తాను నాయుడు అబ్బాయినని, కానీ చెన్నైలో పెరగడం వల్ల తమిళం బాగా మాట్లాడతానని అన్నారు. బహిరంగ వేదికపై కులం పేరు ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేయడంతో పార్తిబన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

వివరణలో ఏమన్నారంటే..!
"నేను ఎలాంటి దురుద్దేశం లేకుండా, చిత్తశుద్ధితో మాట్లాడుతున్నాను. అనుకోకుండా నోరు జారింది. కేవలం పరిహాసంగానే ఆ మాటలు పలికాను. నా ఇన్నేళ్ల అనుభవంలో ఒక కులం పేరును ప్రస్తావించడం ఇదే మొదటిసారి. నిజానికి కులాన్ని గొప్పగా చాటుకునే వారిని నేనే తీవ్రంగా ద్వేషిస్తాను. 'ఇవన్' సహా నా సినిమాల్లో, ఇతర వేదికలపైనా కులతత్వాన్ని తీవ్రంగా ఖండించాను. అలాంటి నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తానా?" అని పార్తిబన్ ప్రశ్నించారు.

"తప్పు జరిగిందని పూర్తిగా అంగీకరిస్తున్నాను. అందుకు చింతిస్తున్నాను. నా మాటల వల్ల బాధపడిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. నా జీవనోపాధి కోసం కులాన్ని వాడుకోవాలనే ఆలోచన నాకు లేదు. నా ప్రతిభను మాత్రమే నమ్ముకుంటాను. భవిష్యత్తులో పొరపాటున కూడా ఇలాంటి తప్పు పునరావృతం కాదు. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించి, గతంలోలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రమే కాదు, ఏ తప్పు జరిగినా సరిచేసుకోవాలనే ఉద్దేశంతో తన పోస్ట్‌ను సరిచేసి మళ్లీ పోస్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

గతంలో రామ్ చరణ్ 'రచ్చ' సినిమాలో కీలకపాత్ర పోషించిన పార్తిబన్, ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఇటీవల నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలపైనా ఆయన క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
Go Back to Shorts
Radhakrishnan Parthiban
Ustaad Bhagat Singh
Pawan Kalyan
Harish Shankar
Radha Krishna Parthiban apology
Telugu movie villain
Trisha comments
Racha movie
Tollywood news
Kollywood actor

More Telugu News