మూలపేట పోర్టుకు మహర్దశ: సీఎం చంద్రబాబు ట్వీట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన ఓడరేవుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారం లభించింది. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుకు బదలాయించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

"మా డబుల్ ఇంజిన్ సర్కార్ కృషితో మూలపేట పోర్టు అభివృద్ధికి పెద్ద ఊతం లభించింది. నౌపడ సాల్ట్ ఫ్యాక్టరీకి చెందిన 385.24 ఎకరాల ఉప్పు భూములను ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుకు బదిలీ చేసేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఈ నిర్ణయం పోర్టు అభివృద్ధికి, ముఖ్యంగా కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన కనెక్టివిటీని బలోపేతం చేయడానికి గణనీయంగా దోహదపడుతుంది.

ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సాధికారత దిశగా ఈ కీలక ముందడుగు వేసినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పోర్టులే దేశ ప్రగతికి చోదకాలు అనే ఆయన దార్శనికతకు అనుగుణంగా, మూలపేట పోర్టు ఇకపై ఒక కీలక కేంద్రంగా అవతరించబోతోంది.

వికసిత భారత్ నిర్మాణంలో ఇది తన వంతు పాత్ర పోషిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా, ఈ ప్రక్రియలో నిరంతరం తమ మద్దతును అందిస్తున్న గౌరవనీయులైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఈ భూ బదలాయింపు నిర్ణయంతో పోర్టు నిర్మాణంలో ఉన్న ఒక ముఖ్యమైన అడ్డంకి తొలగిపోయింది. పోర్టుకు అవసరమైన రోడ్డు, రైలు మార్గాలు వంటి అనుబంధ మౌలిక సదుపాయాల కల్పన ఇకపై వేగంగా జరగనుంది. ఈ పరిణామం రాష్ట్ర ఓడరేవుల ఆధారిత అభివృద్ధికి, తద్వారా ఆర్థిక ప్రగతికి మరింత ఊతాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవనుంది.


More Telugu News