Kalvakuntla Kavitha: ప్రజాపోరాటాలు విజయం సాధిస్తాయని దీని ద్వారా నిరూపితమైంది: కవిత

Kalvakuntla Kavitha on Velugumatla incident
షార్ట్స్‌లో చూడండి
ప్రజాపోరాటాలు విజయం సాధిస్తాయని ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఘటన ద్వారా నిరూపితమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. వెలుగుమట్లలో 750 మంది పేదల ఇళ్లను కూలగొట్టిన అరాచక కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారధన్ మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంయుక్త పోరాటాల ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు.

ఇళ్లు కోల్పోయిన వారిలో 411 మందికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రజా పోరాటాలు తప్పక విజయం సాధిస్తాయనే విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. 750 మంది ఇళ్లు కూల్చివేసి కేవలం 411 మందికి మాత్రమే పట్టాలు ఇవ్వడంతో మిగతా బాధితుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మిగిలిన వారిలో తమకు అన్యాయం జరిగిందనే భావన నెలకొందని అన్నారు.

పట్టాల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ప్రతి బాధితుడికి న్యాయం జరగాలనే లక్ష్యంగా వెలుగుమట్ల బాధితుల కోసం తాము నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని నిజ నిర్ధారణ కమిటీలో ఆర్మీ మాజీ అధికారి, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు భాగస్వాములు అయ్యారని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ కమిటీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని కవిత అన్నారు. ఈ నిజనిర్ధారణ కమిటీకి ప్రభుత్వం, అధికారులు పూర్తిగా సహకరించాలని ఆమె డిమాండ్ చేశారు. 
Go Back to Shorts
Kalvakuntla Kavitha
Kavitha Kalvakuntla
Velugumatla
Telangana Jagruthi
Dharma Samaj Party

More Telugu News