నాకు నయనతార కావాలన్న కలను నెరవేరుస్తారా?: అన్నాడీఎంకే ఎంపీ వ్యాఖ్యలు వివాదాస్పదం

రాజకీయ నిరసనల సందర్భంగా ప్రముఖ సినీ నటి నయనతారను ఉద్దేశించి అన్నాడీఎంకే ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో వివాదాస్పదమయ్యాయి. మహిళల భద్రత కోసం మంగళవారం విల్లుపురంలో ఎన్డీయే కూటమి నిరసన కార్యక్రమం చేపట్టింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి.

ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ, మీ కలలను మాకు చెప్పండి, వాటిని నెరవేర్చడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి ఎంపీ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం మనల్ని కలలు కనమన్నారని, అయితే మన కలలను తమతో పంచుకోవాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని అన్నారు. మన కలలను ఆయనతో పంచుకుంటే నెరవేర్చుతారా అని ప్రశ్నించారు. "నాకు నయనతార కావాలని అడిగితే ఆయన నెరవేరుస్తారా? ఆమెను పెళ్లి చేసుకోవాలనే కల ఎవరికైనా ఉంటే తీరుస్తారా?" అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మా విధానాలను విమర్శించవచ్చని, కానీ మహిళల గురించి అనుచితంగా మాట్లాడవద్దని డీఎంకే పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతారను అవమానించడం ద్వారా మహిళలందరినీ అవమానించినట్లే పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ ఆమోదించరని స్పష్టం చేసింది.


More Telugu News