LPG E-KYC: కేవైసీపై కేంద్రం కీలక ప్రకటన.. ఎల్‌పీజీ వినియోగదారులకు ఊరట

LPG Gas EKYC Not Mandatory for All Clarifies Central Government
షార్ట్స్‌లో చూడండి
ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌కు మళ్లీ ఈ-కేవైసీ చేయించాలంటూ వస్తున్న వార్తలపై నెలకొన్న గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఈ-కేవైసీ ప్రక్రియ అందరికీ తప్పనిసరి కాదని, కేవలం కొందరికి మాత్రమేనని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసి వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించే ప్రయత్నం చేసింది.

ఇప్పటికే కేవైసీ పూర్తి చేసుకున్న సాధారణ వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. కేవలం ఇప్పటివరకు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ (ఈ-కేవైసీ) పూర్తి చేయని వారు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు మాత్రమే దీన్ని చేయాల్సి ఉంటుందని వివరించింది. ఉజ్వల పథకం కింద కనెక్షన్ పొందిన వారు సబ్సిడీ ప్రయోజనాలు కొనసాగడానికి ప్రతి ఆర్థిక సంవత్సరం తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని పేర్కొంది. ముఖ్యంగా 7 సిలిండర్ల తర్వాత 8, 9వ సిలిండర్ రీఫిల్‌పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరమని స్పష్టం చేసింది.

పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధి మీదుగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రభావంతో దేశంలో ఎల్‌పీజీ నిల్వలు తగ్గడంతో కేంద్రం వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించి గృహ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చింది. సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను నిరోధించేందుకు బుకింగ్ గడువును 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇందులో భాగంగానే ఈ-కేవైసీపైనా ఆదేశాలు జారీ చేయడంతో వినియోగదారులందరూ మళ్లీ కేవైసీ చేయించాలనే అపోహతో గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరారు.

ఈ-కేవైసీ ప్రక్రియను వినియోగదారులు తమ ఇళ్ల నుంచే ఆన్‌లైన్‌లో ఉచితంగా పూర్తి చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా నకిలీ కనెక్షన్లను గుర్తించడం, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడం సులభమవుతుందని వివరించింది. ఎలాంటి అంతరాయం లేకుండా సిలిండర్ల సరఫరా జరుగుతుందని హామీ ఇచ్చింది. మొత్తం మీద, కేంద్రం చేసిన ఈ తాజా ప్రకటనతో గ్యాస్ వినియోగదారుల్లో నెలకొన్న ఆందోళన, గందరగోళానికి తెరపడినట్లయింది.
Go Back to Shorts
LPG E-KYC
LPG Gas
Pradhan Mantri Ujjwala Yojana
PMUY
Gas subsidy
LPG cylinder
Gas connection
Iran Israel conflict
Hormuz Strait

More Telugu News