ట్రంప్ తో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై జేడీ వాన్స్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు వాన్స్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. తమ మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, విదేశాంగ విధానం విషయంలో ట్రంప్ నిర్ణయాలకు తామంతా పూర్తి మద్దతుగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యంగా, ఇరాన్ విషయంలో ట్రంప్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని వాన్స్ పేర్కొన్నారు. గతంలో ఇరాన్‌తో యుద్ధం వల్ల అమెరికా వనరులు వృథా అవుతాయని వాన్స్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... "మీరు ప్రభుత్వ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు" అని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. "ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న ట్రంప్ అభిప్రాయంతో నేను 2015 నుంచే ఏకీభవిస్తున్నాను. గత అధ్యక్షుల కంటే ఇప్పుడు మనకు చాలా తెలివైన ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన ఈ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు" అని ట్రంప్ నాయకత్వాన్ని ఆకాశానికెత్తారు.
వాస్తవానికి, గతంలో వాన్స్ దౌత్యపరమైన పరిష్కారాలను కోరుకోగా, ట్రంప్ మాత్రం దూకుడుగా దాడుల వైపు మొగ్గు చూపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు వాన్స్ ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేయడం గమనార్హం.