HPV: గొంతు క్యాన్సర్‌కు కొత్త కారణం తెలిసింది!

HPV Biggest Cause of Throat Cancer New Study Reveals
షార్ట్స్‌లో చూడండి
గొంతు క్యాన్సర్‌కు దశాబ్దాలుగా పొగతాగడమే ప్రధాన కారణమని మనందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గొంతు క్యాన్సర్‌కు అతిపెద్ద కారకంగా మారుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో పొగతాగడం వల్ల వచ్చే క్యాన్సర్ కంటే, హెచ్‌పీవీ వల్ల వచ్చే కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి.

లైంగిక సాంగత్యం, ముఖ్యంగా ఓరల్ సెక్స్ ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. చాలా రకాల హెచ్‌పీవీ వైరస్‌లు మన శరీరంలో వాటంతట అవే అంతమైనప్పటికీ.. హెచ్‌పీవీ-16, హెచ్‌పీవీ-18 రకాలు మాత్రం ప్రాణాంతక క్యాన్సర్‌కు దారితీస్తాయి. సాధారణంగా ఈ వైరస్‌లు మహిళల్లో గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌ను కలిగిస్తాయని మనకు తెలుసు. అయితే, ఇవి గొంతులోని టాన్సిల్స్, నాలుక కుదురు భాగంలో కూడా క్యాన్సర్ కణతులను వృద్ధి చేస్తున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.

"ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి వస్తోంది. సంపర్కం జరిగిన 10 నుంచి 30 ఏళ్ల తర్వాతే ఈ క్యాన్సర్ బయటపడుతుంది" అని ఫోర్టీస్ ఆసుపత్రి అంకాలజీ డైరెక్టర్ డాక్టర్ బి.నిరంజన్ నాయక్ పేర్కొన్నారు. ముందుగానే గుర్తిస్తే ఈ మహమ్మారిని నయం చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

లక్షణాలు ఇవే
రెండు వారాలకు మించి తగ్గని గొంతు నొప్పి
ఆహారం లేదా నీటిని మింగడంలో ఇబ్బంది
మెడ లేదా గొంతు భాగంలో గడ్డలు (కణతులు)
విడవని చెవి నొప్పి

పరిష్కారం వ్యాక్సినేషన్
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్లలోపు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ఇస్తోంది. ఇది భవిష్యత్తులో గొంతు క్యాన్సర్‌ను కూడా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అయితే, ఈ వైరస్ లైంగికంగా వ్యాప్తి చెందుతున్నందున, బాలికలతో పాటు బాలురకు కూడా హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలనే వాదన ఇప్పుడు బలం పుంజుకుంటోంది.
Go Back to Shorts
HPV
Human Papillomavirus
Throat Cancer
Oral Sex
Dr Niranjan Naik
Cervical Cancer
HPV Vaccine
Cancer Prevention
Fortis Hospital
Sexual Health

More Telugu News