Chandrababu Naidu: ముస్లింల అభివృద్ధి, సంక్షేమమే మా లక్ష్యం: ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on Muslim Welfare at Iftar Feast
షార్ట్స్‌లో చూడండి
విజయవాడలో సోమవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులందరికీ ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలను ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పేదలకు సాయం చేయడమే ఖురాన్ ప్రవచించిన గొప్ప సూక్తి అని, మహ్మద్ ప్రవక్త బోధనలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల కాలంలో మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలు అందించామని చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ భరోసా కింద 4.38 లక్షల మంది ముస్లింలకు ఏటా రూ.3,511 కోట్లు అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా, 4.5 లక్షల మంది విద్యార్థులకు 'తల్లికి వందనం' అందిస్తున్నామని, 19,215 మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పుల కింద రూ.240 కోట్లు, దీపం పథకం ద్వారా 6.20 లక్షల కుటుంబాలకు రూ.158 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. 33,275 మందికి ఆర్థిక చేయూత కింద రూ.193 కోట్లు అందించామని చెప్పారు.

ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనాన్ని రూ.5 వేలు, రూ.10 వేలకు పెంచి రూ.180 కోట్లు అందించామని, బకాయిలుగా ఉన్న రూ.45 కోట్లను కూడా విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అర్హులైన ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించనున్నామని, వివాహ లైసెన్స్ గడువును 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతున్నామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచే 347 మంది హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు పూర్తిచేశామని గుర్తుచేశారు.

గత పాలకులు జీవో 47 ద్వారా వక్ఫ్ బోర్డును వివాదాల్లోకి నెట్టారని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేసి, బోర్డుకు ఎన్నికలు నిర్వహించిందని, సుమారు 1500 వక్ఫ్ ఆస్తులపై సర్వే పూర్తి చేశామని తెలిపారు. వక్ఫ్ ఆస్తులను కాపాడి, వాటి ఫలాలను ముస్లింల సంక్షేమానికే వినియోగిస్తామని భరోసా ఇచ్చారు. నూర్ బాషా ఫెడరేషన్‌ను దూదేకుల ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్‌గా మార్చి రూ.100 కోట్లు కేటాయించామన్నారు.

మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ, గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.5,434 కోట్ల నుంచి ఈసారి రూ.6,090 కోట్లకు పెంచామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఉర్దూ అకాడమీకి కేవలం రూ.1 లక్ష ఇస్తే, తాము రూ.7 కోట్లు మంజూరు చేశామన్నారు. ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించామని, కడప, విజయవాడ నగరాల్లో హజ్ హౌస్‌ల నిర్మాణం త్వరలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
Muslim Welfare
Iftar Party
Minority Development
Ramzan
NTR Bharosa
Wakf Board
Urdu Academy
Haj Pilgrimage

More Telugu News