ఆస్కార్ వేదికపై మెరిసిన ప్రియాంక చోప్రా

ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హాలీవుడ్ నటుడు జేవియర్ బార్డెమ్‌తో కలిసి ఆమె 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డును ప్రదానం చేసేందుకు వేదికపైకి వచ్చారు. ఈ సందర్భంగా నటుడు జేవియర్ బార్డెమ్ మైక్‌లో "ఫ్రీ పాలస్తీనా" అని గట్టిగా నినదించడం చర్చనీయాంశమైంది.

అనంతరం వీరిద్దరూ కలిసి నార్వే చిత్రం ‘సెంటిమెంటల్ వ్యాల్యూ’కు అవార్డును అందించారు. జోకిమ్ ట్రియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒక తండ్రికి, ఇద్దరు కుమార్తెల మధ్య ఉన్న సంక్లిష్ట సంబంధాల నేపథ్యంలో తెరకెక్కింది.

ఈ వేడుక కోసం ప్రియాంక చోప్రా డియోర్ సంస్థ ప్రత్యేకంగా డిజైన్ చేసిన తెల్ల గౌనులో మెరిశారు. పాత హాలీవుడ్ శైలిని ప్రతిబింబించేలా ఉన్న ఈ డ్రెస్‌లో ఆమె ఎంతో అందంగా కనిపించారు. వజ్రాలు, పచ్చలతో కూడిన నెక్లెస్‌, చెవిపోగులు ధరించారు. ప్రియాంక తన భర్త, పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. నిక్ క్లాసిక్ బ్లాక్ టక్సేడోలో కనిపించారు.

లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ హోస్ట్ కోనన్ ఓ'బ్రియన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 


More Telugu News