అమరావతిలో రేపు అమరజీవి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మార్చి 16) అమరావతి, విజయవాడ నగరాల్లో రెండు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.

వివరాల్లోకి వెళితే, సోమవారం ఉదయం 11:15 గంటలకు అమరావతిలోని శాఖమూరు పార్కు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన విషయం తెలిసిందే. ఆయన త్యాగానికి ప్రతీకగా 58 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో 6.80 ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన పొట్టి శ్రీరాములు స్మృతివనం ప్రాజెక్టులో భాగంగా మొదటి దశ పనులు పూర్తయ్యాయి.

పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేవలం ఆరు నెలల రికార్డు సమయంలో ఈ భారీ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ విగ్రహం తయారీకి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్‌ను వినియోగించారు. ప్రాజెక్టులో భాగంగా రెండో దశలో ఇక్కడ ఒక మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ వంటివి నిర్మించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడకు బయలుదేరి వెళతారు.

సాయంత్రం 5:40 గంటలకు విజయవాడలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ముస్లిం మైనారిటీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపి, వారితో కలిసి ఆయన ఇఫ్తార్ స్వీకరిస్తారు.


More Telugu News