వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తుపై సునీత తీవ్ర అసంతృప్తి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ తీరుపై ఆయన కుమార్తె డాక్టర్ సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఐ బాధ్యతాయుతంగా, లోతుగా దర్యాప్తు చేయలేదని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కడప జిల్లా పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఈ కేసులో తనకు అందరూ అన్యాయం చేస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. "నిందితులు చెప్పింది వినడమే తప్ప సీబీఐ లోతుగా దర్యాప్తు జరపలేదు. హత్యకు ముందు, తర్వాత నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. సాక్షిలో గుండెపోటు వార్త రావడానికి నిమిషం ముందే కిరణ్ యాదవ్ అనే వ్యక్తి అర్జున్‌రెడ్డికి మెసేజ్ పంపాడు. ఈ కీలక ఆధారాన్ని సీబీఐ ఎందుకు లోతుగా పరిశీలించలేదు?" అని ఆమె ప్రశ్నించారు.

తాను కోర్టుతో పాటు సీబీఐకి కూడా అదనపు ఆధారాలు సమర్పించినప్పటికీ, వాటిపై కూడా సరైన విచారణ జరగలేదని సునీత ఆరోపించారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన అర్ధాంగి భారతిని విచారించాల్సిన అవసరం ఉందని, కానీ సీబీఐ వారిని విచారించలేదని అన్నారు. తాను ఇంతగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సునీత.. న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


More Telugu News