Iraq drone attack: ఇరాక్‌లో డ్రోన్ల బీభత్సం: రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. అమెరికా ఎంబసీపై దాడులు!

Iraq Drone Attack Refinary Fire US Embassy Targeted
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఆకాశమంత ఎత్తున దట్టమైన నల్లటి పొగ అలుముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో రిఫైనరీలో చమురు ఉత్పత్తిని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

కుర్దిస్థాన్ ప్రాంత ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం నాటికి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, పనులు ఇంకా మొదలుకాలేదు. దాడి వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు రిఫైనరీ కార్యకలాపాలు పునరుద్ధరించే అవకాశం లేదని సమాచారం.

మరోవైపు, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కూడా శనివారం దాడులు జరిగాయి. ఎంబసీ ప్రాంగణంలోని 'హెలిప్యాడ్', 'రాడార్ వ్యవస్థ' లక్ష్యంగా సూసైడ్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో కార్యాలయ ప్రాంగణంలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం వాటిల్లింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టిన తర్వాత బాగ్దాద్‌లోని ఎంబసీపై దాడి జరగడం ఇది రెండోసారి.

బాగ్దాద్ విమానాశ్రయం వద్ద ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని నిరంతరం డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ మద్దతు గల 'ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్' (IRI) గ్రూపు ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ప్రకటనలు విడుదల చేస్తోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా తన రాయబార కార్యాలయ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.
Iraq drone attack
Erbil oil refinery
Baghdad US embassy
Islamic Resistance in Iraq
Iran
US military bases
drone attack
oil refinery fire
middle east conflict
Baghdad airport

More Telugu News