హర్మూజ్ తర్వాత మరో జలసంధి బంద్?.. బాబ్ ఎల్-మాండెబ్‌పై హౌతీల గురి

  • ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నిలిచిన రాకపోకలు
  • మరో కీలక మార్గం బాబ్ ఎల్-మాండెబ్‌పై దాడులకు హౌతీల హెచ్చరిక
  • ఇరాన్‌కు మద్దతుగానే ఈ బెదిరింపులని స్పష్టం చేసిన హౌతీ నేతలు
  • రెండు మార్గాలు మూసుకుపోతే ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం అంచనా
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇప్పటికే కీలకమైన హర్మూజ్ జలసంధి మూసుకుపోగా ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి మరో ముప్పు పొంచి ఉంది. ఇరాన్ మిత్రపక్షమైన యెమెన్‌లోని హౌతీ రెబల్స్.. ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు పునఃప్రారంభిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఒకేసారి రెండు ప్రధాన సముద్ర మార్గాలు స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది.

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యకు ప్రతిస్పందనగానే హౌతీలు ఈ బెదిరింపులకు దిగుతున్నారు. హార్ముజ్ మార్గం మూసుకుపోవడంతో, అనేక వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయంగా బాబ్ ఎల్-మాండెబ్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా ఈ మార్గంలో నౌకల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఇదే అదనుగా దాడులకు దిగితే ప్రపంచ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

హౌతీల నాయకుడు అబ్దుల్-మాలిక్ అల్-హౌతీ మాట్లాడుతూ.. అవసరమైతే చర్యలకు దిగేందుకు తమ "వేళ్లు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని" హెచ్చరించారు. క్షిపణులు, డ్రోన్లతో దాడికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఫిబ్రవరి చివరి నుంచి హౌతీలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి కొత్త దాడులు జరిగినట్లు నిర్ధారణ కాలేదు.

ప్రపంచ కంటైనర్ వాణిజ్యంలో దాదాపు 30 శాతం బాబ్ ఎల్-మాండెబ్, సూయజ్ కాలువ మార్గం గుండానే సాగుతుంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే పలు అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను ఆఫ్రికా చుట్టూ సుదీర్ఘ మార్గంలో మళ్లిస్తున్నాయి. మరోవైపు, అమెరికాకు చెందిన విమానవాహక నౌక ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తుండటం హౌతీల తదుపరి చర్యలకు పరీక్షగా నిలవనుంది.

Houthi Rebels
Bab el-Mandeb Strait
Red Sea
Yemen
Iran
Israel
US Military
Shipping
Trade Routes
Strait of Hormuz

More Telugu News