US Military: యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ: ఆరుగురు సైనికుల మృతి.. 5 విమానాల ధ్వంసం

US Military Suffers Heavy Losses in War with Iran
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికాకు శనివారం భారీ నష్టం వాటిల్లింది. ఇరాక్ సరిహద్దులో జరిగిన విమాన ప్రమాదంలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించగా, సౌదీ అరేబియాలోని సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఐదు కీలక విమానాలు దెబ్బతిన్నాయి. ఈ రెండు ఘటనలతో అమెరికా దళాల్లో ఆందోళన నెలకొంది.

పశ్చిమ ఇరాక్ గగనతలంలో ఇంధనం నింపే రెండు ‘KC-135’ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక విమానం కుప్పకూలిపోగా, అందులోని ఆరుగురు సిబ్బంది మరణించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. అయితే ఇది శత్రువుల దాడి కాదని అమెరికా స్పష్టం చేయగా, ఆ విమానాన్ని తామే కూల్చివేశామని ఇరాన్ మద్దతున్న ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ అనే గ్రూపు ప్రకటించుకుంది.

మరోవైపు, సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో గాల్లోనే యుద్ధ విమానాలకు ఇంధనం నింపే ఐదు అమెరికా విమానాలు దెబ్బతిన్నాయని ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తన కథనంలో వెల్లడించింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, దెబ్బతిన్న విమానాలకు మరమ్మతులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు కువైట్, సౌదీ స్థావరాలపై జరిగిన డ్రోన్ దాడుల్లో మరణించగా, తాజాగా మరో ఆరుగురు విమాన ప్రమాదంలో మృతి చెందారు. యుద్ధంలో నష్టాలు సహజమని, ఇరాన్‌పై పోరాటం ఆపబోమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించారు. యుద్ధం తీవ్రరూపం దాల్చితే మరణాల సంఖ్య పెరగొచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే హెచ్చరించడం గమనార్హం.
US Military
Iran
Iraq
Saudi Arabia
KC-135
Prince Sultan Air Base
Donald Trump
Pete Hegseth
Islamic Resistance in Iraq
US Soldiers Killed

More Telugu News