ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర (82) కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇవాళ విషమించడంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హెచ్ జే దొర కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని నిమ్స్ లో డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన బాత్రూంలో పడిపోయినట్టు తెలుస్తోంది. హెచ్‌జే దొర తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు నిమ్స్ కు తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు.

1965 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హెచ్‌జే దొర శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఆయన విశేష సేవలు అందించారు. ముఖ్యంగా, రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని (నక్సలిజం) అణచివేయడంలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గానూ జాతీయ స్థాయిలో పలు ఉన్నత పదవులు చేపట్టారు. దొర 1996లో డీజీపీగా ప్రమోషన్ పొందారు. ఆయన తన సుదీర్ఘ వృత్తి జీవితానుభవాలతో 'జర్నీ త్రూ టర్బ్యులెంట్ టైమ్స్' పేరుతో ఆత్మకథను కూడా రచించారు.



More Telugu News