Vijay: తన పేరులో తండ్రి పేరును తొలగించిన హీరో విజయ్ కుమారుడు
- తమిళ స్టార్ విజయ్ కుటుంబంలో మరో కీలక పరిణామం
- తండ్రి పేరును తొలగించి తల్లి పేరును చేర్చుకున్న కుమారుడు జాసన్ సంజయ్
- ఇప్పటికే సోషల్ మీడియాలో తండ్రిని అన్‌ఫాలో చేసిన జాసన్
తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు కోలీవుడ్‌లో, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రాజకీయాల్లో బిజీ అవుతున్న తరుణంలోనే ఆయన కుటుంబంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దర్శకుడిగా తన అరంగేట్ర చిత్రం 'సిగ్మా' పనుల్లో బిజీగా ఉన్న జాసన్ సంజయ్... తన తండ్రి విజయ్ పేరును తన పేరు పక్కన నుంచి తొలగించాడు. తాజా సమాచారం ప్రకారం, తన పేరులో తన తండ్రి అక్షరం 'V'ని తొలగించి... 'Jason Sanjay S' గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 'S' అంటే తన తల్లి సంగీత పేరును సూచిస్తుంది. గతంలోనే సోషల్ మీడియాలో తండ్రిని అన్‌ఫాలో చేసిన జాసన్, ఇప్పుడు ఏకంగా తండ్రి పేరునే పక్కన పెట్టడం గమనార్హం.
మరోవైపు, విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగలపట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడం తమిళనాట కలకలం రేపింది. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, అది తనను మానసిక వేదనకు గురిచేసిందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో పిల్లలు ఇద్దరూ (జాసన్ సంజయ్, దివ్య సాషా) తల్లికే మద్దతుగా నిలిచినట్లు సమాచారం. తనతో పాటు పిల్లల పోషణ కోసం భృతి చెల్లించాలని, అలాగే తమ నివాసం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు.
రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2026 అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్‌కు, ఈ కుటుంబ కలహాలు, విడాకుల వ్యవహారం పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం జాసన్ సంజయ్ తన తల్లికి అండగా ఉంటూనే, తన సినీ కెరీర్‌ను విజయ్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.