TGPSC: తెలంగాణ ఉద్యోగార్థులకు గమనిక.. టీజీపీఎస్సీ ఓటీఆర్‌లో కొత్త రూల్స్

TGPSC OTR New Rules for Telangana Job Aspirants
  • టీజీపీఎస్సీ వన్‌టైం రిజిస్ట్రేషన్‌లో కీలక మార్పులు
  • ఏడాదిలో జనవరి, జూన్‌ నెలల్లో మాత్రమే అప్‌డేట్ చేసుకునే అవకాశం
  • విద్యార్హతల సర్టిఫికెట్లను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి
  • ఓటీఆర్ వివరాల ఆధారంగానే ఉద్యోగాలకు అర్హత నిర్ణయం
  • తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఓటీఆర్ రద్దు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఇది ముఖ్య గమనిక. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తన వన్‌టైం రిజిస్ట్రేషన్ (OTR) విధానంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఉద్యోగ ప్రకటనలకు అభ్యర్థుల అర్హతను కేవలం ఓటీఆర్‌లో పొందుపరిచిన వివరాల ఆధారంగానే నిర్ధారించనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ వివరాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవడం అత్యవసరంగా మారింది.

ఏడాదికి రెండుసార్లే అవకాశం
కొత్త నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ ఓటీఆర్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి ఏడాదిలో రెండుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి, జూన్ నెలల్లో వారం నుంచి 10 రోజుల పాటు ఓటీఆర్ అప్‌డేట్ విండోను అందుబాటులో ఉంచుతారు. ఆ సమయంలో అభ్యర్థులు తాము కొత్తగా సంపాదించిన అదనపు విద్యార్హతలను, ఇతర మార్పులను నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే ఓటీఆర్‌లో అదనపు అర్హతలు నమోదు చేసుకోని వారు, ఈనెల 25వ తేదీలోగా తమ ఐడీతో లాగిన్ అయి సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాలని కమిషన్ సూచించింది.

సర్టిఫికెట్ల అప్‌లోడ్ తప్పనిసరి
గతంలో ఓటీఆర్‌లో విద్యార్హతలు, ఇతర వివరాలను పేర్కొంటే సరిపోయేది. కానీ, తాజా సవరణల ప్రకారం నమోదు చేసే ప్రతి అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాన్ని (సర్టిఫికెట్‌ను) తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. అభ్యర్థులు తమ తాజా కలర్ ఫొటోను, కొత్తగా పొందిన విద్యార్హతల సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుంది. అదనపు అర్హతలు, చిరునామా, ఈడబ్ల్యూఎస్, నాన్-క్రీమీలేయర్ కేటగిరీలు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటివి మాత్రమే అప్‌డేట్ చేయడానికి వీలుంటుంది. ఒకసారి అప్‌డేట్ చేసిన ఓటీఆర్, అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసేంత వరకు చెల్లుబాటులో ఉంటుంది.

ముందస్తు పరిశీలన.. తప్పు చేస్తే రద్దు
ఓటీఆర్‌లో అభ్యర్థులు నమోదు చేసిన కుల, ఆదాయ, విద్యార్హతల వివరాలను టీజీపీఎస్సీ ముందస్తుగా పరిశీలిస్తుంది. మీసేవ, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యామండలి వంటి సంస్థల సహకారంతో ఈ వివరాల వాస్తవికతను నిర్ధారించుకుంటుంది. ఎవరైనా తప్పుడు సమాచారం లేదా నకిలీ సర్టిఫికెట్లతో వివరాలు నమోదు చేసినట్లు తేలితే, వారి ఓటీఆర్‌ను తక్షణమే రద్దు చేస్తామని కమిషన్ హెచ్చరించింది. ప్రస్తుతం కమిషన్ వద్ద 31.56 లక్షల ఓటీఆర్‌లు ఉండగా, గత రెండేళ్లలో కొత్తగా సుమారు 2 లక్షల మంది ఉద్యోగార్థులు వచ్చి చేరారని, వారంతా తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో నోటిఫికేషన్లకు అర్హత కోల్పోకుండా ఉండాలంటే అభ్యర్థులు వెంటనే తమ ఓటీఆర్‌ను సరిచూసుకోవడం మంచిది.
TGPSC
Telangana jobs
TSPSC OTR
Telangana State Public Service Commission
employment news
government jobs
Telangana recruitment
OTR update
job aspirants

More Telugu News