ఉగాదికి సామూహిక గృహప్రవేశాలు.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన

  • రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల మందికి చేకూరనున్న లబ్ది
  • మున్ముందు విద్యుత్‌ ఛార్జీలు మరింత తగ్గిస్తాం..
  •  కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ లో ఉగాది కానుకగా సామూహిక గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు ఈ రోజు సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. 

ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు, పథకాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయని.. సూపర్‌ సిక్స్‌ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని, పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా అమలు చేయాలని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను మరింత తగ్గిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్‌ పేరిట ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం మోపారని చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టాక ట్రూడౌన్‌ చేశామని, విద్యుత్ చార్జీల భారం మరింత తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.


More Telugu News