బుమ్రాకు స్లో బాల్స్ నేర్పించింది నేనే: యూఏఈ పేసర్

  • బుమ్రాకు స్లో డెలివరీలు నేర్పింది తానేనన్న యూఏఈ బౌలర్ జహూర్ ఖాన్
  • 2019 ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని వెల్లడి
  • యాక్షన్ మార్చకుండా స్లో బాల్ వేసే టెక్నిక్‌ను బుమ్రాకు వివరించినట్లు వెల్ల‌డి
  • ప్రపంచ స్థాయి బౌలర్ అయిన బుమ్రా తనను అడగటం గొప్పగా అనిపించిందని వ్యాఖ్య
టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాకు బౌలింగ్ టెక్నిక్‌లో తాను సహాయం చేశానంటూ పాకిస్థాన్ సంతతికి చెందిన యూఏఈ బౌలర్ జహూర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ యాక్షన్ మార్చకుండా స్లో డెలివరీలు ఎలా వేయాలో బుమ్రాకు తానే నేర్పించానని అతను వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన 2019 ఐపీఎల్ సీజన్‌లో జరిగిందని జహూర్ గుర్తుచేసుకున్నాడు.

2019లో ఐపీఎల్ యూఏఈలో జరిగినప్పుడు, తాను ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాను. ఆ సమయంలో అబుదాబిలో జరిగిన ఓ మ్యాచ్‌లో బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, నాథన్ కౌల్టర్-నైల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. "సెప్టెంబర్ నెలలో యూఏఈలో 50 డిగ్రీల వేడి ఉంటుంది. బంతి తడిగా మారి పట్టుకోవడం కూడా కష్టమవుతుంది. ఆ మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ నన్ను పిలిచింది. ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండి ఏడో రోజు ప్రాక్టీస్‌కు వెళ్లాను" అని జహూర్ వివరించాడు.

టీ10 లీగ్‌లో తాను ఒకే ఓవర్‌లో యార్కర్ తర్వాత ఐదు స్లో బాల్స్ వేసి మెయిడిన్ చేయడం వల్ల జహీర్ ఖాన్, రాబిన్ సింగ్‌లకు తన గురించి తెలుసని జహూర్ చెప్పాడు. ఒకరోజు అందరూ కూర్చున్నప్పుడు బుమ్రా, రోహిత్ శర్మ కూడా అక్కడికి వచ్చారని, అప్పుడే బౌలింగ్ గురించి చర్చ జరిగిందని అన్నాడు. "ఒకే యాక్షన్‌లో స్లో బాల్ ఎలా వేస్తావని బుమ్రా అడిగాడు. ప్రాక్టీస్‌లో చూపిస్తానని చెప్పాను" అని జహూర్ గుర్తుచేసుకున్నాడు.

ఆ తర్వాత నెట్ ప్రాక్టీస్‌లో తాను స్లో బౌన్సర్ వేయగా, బ్యాటర్ దాన్ని ఆడలేకపోయాడని జహూర్ తెలిపాడు. ఇది చూసిన ముంబై బౌలింగ్ కోచ్ షేన్ బాండ్, హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఆశ్చర్యపోయారని చెప్పాడు. "ఇది క్రికెట్‌లో ఓ కొత్త విషయం అని వాళ్లు అనుకున్నారు. నా గ్రిప్ చూపించమని అడిగారు. ఆ తర్వాత రెండు రోజులకే బుమ్రాతో కలిసి బౌలింగ్ చేశాను. అప్పుడు అతనికి నా గ్రిప్, టెక్నిక్ చూపించాను. అది చూసి 'ఇది నెక్స్ట్ లెవెల్ విషయం' అని బుమ్రా అన్నాడు. అతను ప్రపంచ స్థాయి బౌలర్, నేను యూఏఈకి ఆడుతున్నాను. అయినా అంత పెద్ద స్టార్ నన్ను అడిగి తెలుసుకోవడం చాలా గొప్పగా అనిపించింది" అని జహూర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.


More Telugu News