బీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. కేసీఆర్‌నే నా పార్టీలోకి ఆహ్వానిస్తా: కవిత సంచలన వ్యాఖ్యలు

  • డాడీ, మోదీ, రేవంత్ రెడ్డిలే తన రాజకీయ ప్రత్యర్థులన్న కవిత
  • కష్టకాలంలో బీఆర్‌ఎస్ సోషల్‌ మీడియా అండగా నిలవలేదని ఆవేదన
  • జైలు జీవితం తనను జగమొండిగా మార్చేసిందన్న జాగృతి అధ్యక్షురాలు
  • వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టీకరణ
తాను తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అవసరమైతే తన తండ్రి కేసీఆర్‌నే తన జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తానని ఆమె వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఖమ్మం నుంచి తనను పోలీసులు బలవంతంగా తరలించిన తర్వాత హైదరాబాద్‌లో ఆమె మరోసారి దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తన రాజకీయ పోరాటం డాడీ (కేసీఆర్), మోదీ, రేవంత్ రెడ్డిలతోనే ఉంటుందని తేల్చి చెప్పారు. పార్టీ నిలబడాలంటే ప్రత్యర్థులతో కొట్లాడక తప్పదని వ్యాఖ్యానించారు. లేఖ లీకైనప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్‌లతో తాను మాట్లాడలేదని, కేవలం తల్లితో మాత్రమే ఎమోషనల్‌గా టచ్‌లో ఉన్నానని వెల్లడించారు. 2022లో తనపై కేసు నమోదైనప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఆ సమయంలో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా తనకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

"జైలు జీవితం నన్ను జగమొండిని చేసింది. నా ఈ పరిస్థితికి కారణమైన వారు కచ్చితంగా అనుభవిస్తారు" అని కవిత హెచ్చరించారు. భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వమే మదర్ బోర్డుగా పనిచేసే కొత్త పార్టీ వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం రాజ్యాంగం పట్టుకుని మాట్లాడే రాహుల్ గాంధీ, పేదల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలంటూ కవిత చేపట్టిన దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేసి ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అయితే బాధితులకు కొత్త ఇళ్లు కట్టించి, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు తన నిరాహార దీక్ష ఆపబోనని కవిత స్పష్టం చేశారు. భూముల రేట్లు పెరగడంతో పెద్దలకు కట్టబెట్టేందుకే పేదల ఇళ్లు కూల్చేశారని ఆమె ఆరోపించారు.

K Kavitha
Kalvakuntla Kavitha
BRS
Telangana Jagruti
KCR
Revanth Reddy
Khammam
Velugumatla
Land Dispute
Telangana Politics

More Telugu News