Chandrababu Naidu: పాలనపై సీఎం చంద్రబాబు ఫోకస్... ఈ నెల 11, 12 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

Chandrababu Naidu Focus on Governance Collectors Conference on 11th 12th
  • అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్‌ అమలుపై ప్రధానంగా చర్చ
  • రెండో రోజు శాంతిభద్రతలపై ఎస్పీలతో ప్రత్యేక సమావేశం
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి సమీక్షలు జరిపి, పరిపాలన యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు.

సచివాలయంలోని ఐదో బ్లాకులో జరిగే ఈ సదస్సు మొదటి రోజు ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ స్వాగత ప్రసంగంతో మొదలవుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాల అనంతరం ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం "స్వర్ణాంధ్ర @2047" విజన్‌లో భాగంగా నిర్దేశించుకున్న పది సూత్రాల అమలుపై చర్చిస్తారు. పేదరిక నిర్మూలన, జల భద్రత, వ్యవసాయంలో సాంకేతికత వినియోగం వంటి అంశాలపై సమీక్షిస్తారు. రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు, జిల్లాల వారీగా సాధించిన ప్రగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటారు. డిజిటల్ గవర్నెన్స్‌లో భాగంగా ఈ-ఆఫీస్ ఫైళ్ల సత్వర పరిష్కారం, పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేస్తారు.

రెండో రోజు సమావేశంలో ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన "సూపర్ సిక్స్" పథకాల అమలు తీరును సమీక్షిస్తారు. వీటితో పాటు మధ్యాహ్న భోజన పథకం, వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. భూ పరిపాలన, రెవెన్యూ రాబడుల పెంపు, విద్య, ఉపాధి కల్పన వంటి అంశాలపైనా సమీక్షలు ఉంటాయి.

సదస్సులో భాగంగా రెండో రోజు సాయంత్రం జరిగే సమావేశం అత్యంత కీలకం కానుంది. రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. ఈ సెషన్‌కు జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు కూడా హాజరుకానున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల ప్రస్తుత పరిస్థితిపై డీజీపీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మొత్తంగా ఈ రెండు రోజుల సమావేశాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ లక్ష్యాలపై అధికార యంత్రాంగానికి పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
Chandrababu Naidu
Andhra Pradesh
Collectors Conference
Government Schemes
Development Programs
Amaravati
Poverty Reduction
Water Security
Agriculture Technology
GSDP Growth Rate

More Telugu News