Suryakumar Yadav: బుమ్రా తరానికి ఒక్కడే.. అతను ఈ దేశ సంపద: కెప్టెన్ సూర్యకుమార్

Suryakumar Yadav Praises Jasprit Bumrah After World Cup Win
  • మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్
  • బుమ్రా ఈ దేశ సంపద అంటూ కొనియాడిన కెప్టెన్ సూర్య
  • ప్రపంచకప్‌ గెలవడంతో త‌న సుదీర్ఘ‌ ప్రయాణం ముగిసిందన్న సూర్య‌భాయ్‌
  • ఫైనల్లో రాణించిన సంజూ, అభిషేక్‌లపై ప్రశంసలు
టీమిండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి, సొంతగడ్డపై టైటిల్ అందుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో భారత్ ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే, కెప్టెన్‌గా తన సుదీర్ఘ‌ ప్రయాణంపై మాట్లాడాడు. 

ఈ విజయంపై సూర్యకుమార్ మాట్లాడుతూ... "ఈ గెలుపును పూర్తిగా ఆస్వాదించడానికి కొంత సమయం పడుతుంది. కానీ చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. 2024 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్‌గా నా ప్రయాణం మొదలైంది. జై షా, రోహిత్ భాయ్ నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రపంచకప్‌ గెలవడంతో నా ప్రయాణం ముగిసింది" అని తెలిపాడు. ఈ గెలుపు ఘనతను జట్టు సభ్యులకే అంకితమిచ్చాడు.

గత రెండేళ్లుగా తాము అద్భుతమైన క్రికెట్ ఆడామని, కుర్రాళ్ల అసాధారణ ప్రదర్శనతోనే ఈ గెలుపు సాధ్యమైందని సూర్య పేర్కొన్నాడు. "ఆటగాళ్ల సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మా జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నారని నాకు తెలుసు. ముఖ్యంగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లు కీలకమైన ఫైనల్లో తమ సత్తా చాటారు. వారు ఏదో ఒక ప్రత్యేకత చేస్తారనే నమ్మకం మాకు ఉంది. సరైన సమయంలో రాణించారు" అని యువ ఆటగాళ్లను ప్రశంసించాడు.

బుమ్రా ఈ దేశ సంపద..
ఇక, టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించాడు. "బుమ్రా తరానికి ఒక్కడు మాత్రమే పుట్టే బౌలర్. నేను అతడిని 'దేశ సంపద'గా పిలుస్తాను. విజయాన్ని ఎలా పూర్తి చేయాలో అతనికి బాగా తెలుసు. ఈ రంగంలో అతనే అత్యుత్తమ ఆటగాడు" అని కితాబునిచ్చాడు. 
Suryakumar Yadav
T20 World Cup 2026
Jasprit Bumrah
India vs New Zealand
Indian Cricket Team
Sanju Samson
Abhishek Sharma
Cricket World Cup
T20 World Cup Final
Cricket

More Telugu News