ఈ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోమని మెయిల్ వచ్చిందా, అది ఫేక్: పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం

  • ఇలాంటి మెయిల్స్ వస్తే స్పందించకూడదన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • లింకులు, కాల్స్, ఎస్సెమ్మెస్‌లు పంపించి సున్నితమైన సమాచారం అడుగుతారని హెచ్చరిక
  • ఎప్పుడూ తప్పుడు సమాచారాన్ని విశ్వసించవద్దన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ఇ-పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలని మీకు ఈ-మెయిల్ వచ్చిందా? ఇలాంటి మెయిల్స్ వస్తే అది సైబర్ నేరగాళ్ల పనిగా గ్రహించండి... "మీ ఇ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి" అని వస్తే అది ఫేక్ మెయిల్‌గా నిర్ధారించుకోవాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. ఇలాంటి మెయిల్స్ వస్తే వాటికి స్పందించకూడదని సూచించింది. లింకులు, కాల్స్, ఎస్సెమ్మెస్‌లు పంపించి ఆర్థిక వివరాలు, సున్నితమైన సమాచారం అడుగుతారని హెచ్చరించింది.

అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎప్పుడూ తప్పుడు సమాచారాన్ని విశ్వసించవద్దని పేర్కొంది. ఏదైనా సందేహం ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయించాలని పేర్కొంది.

ఆదాయపు పన్ను శాఖ నుంచి అని వచ్చే మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యుత్తరం ఇవ్వవద్దని, ఎలాంటి అటాచ్‌మెంట్‌లను తెరువవద్దని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. ఫిషింగ్ వెబ్ సైట్‌లకు సంబంధించిన లింకులపై క్లిక్ చేసి బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు వివరాలు ఇవ్వవద్దని తెలిపింది.


More Telugu News