రాష్ట్రపతి పర్యటనలో బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది: మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ఆగ్రహం

  • పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన
  • హఠాత్తుగా అంతర్జాతీయ సంతాల్ సదస్సు వేదిక మార్పు
  • మమతా బెనర్జీ ప్రభుత్వం తన పరిధి దాటి వ్యవహరించిందన్న కిషన్ రెడ్డి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు, బిధానగర్‌లో జరగాల్సిన అంతర్జాతీయ సంతాల్ సదస్సును హఠాత్తుగా మరోచోటుకు మార్చడంపై మోదీ మండిపడ్డారు. మమతా బెనర్జీ అన్ని హద్దులు దాటారని విమర్శించారు. రాష్ట్రపతికి జరిగిన అవమానానికి ప్రభుత్వ యంత్రాంగానిదే బాధ్యత అన్నారు.

ఇది సిగ్గుచేటు విషయమని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా మమతా బెనర్జీ చర్య ఉందని ఆరోపించారు. మమతా బెనర్జీ తీరుతో గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతి పడిన ఆవేదన దేశ ప్రజల మనసుల్లో అపార దుఃఖాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు.

దురదృష్టకరమన్న కిషన్ రెడ్డి

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పశ్చిమ బెంగాల్ గడ్డపై మమతా బెనర్జీ ప్రభుత్వం అవమానించడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది అత్యంత దురదృష్టకర సంఘటన అని పేర్కొన్నారు. బెంగాల్ ప్రభుత్వం తన పరిధిని దాటి వ్యవహరించిందని ఆరోపించారు.

రాష్ట్రపతి పట్ల ప్రభుత్వం తీరు, గిరిజన సదస్సు వేదికను హఠాత్తుగా మార్చడం వంటి పరిణామాలతో వారు గిరిజన సమాజాన్ని, వారి సంస్కృతి సంప్రదాయాలను కూడా అవమానించినట్లే అని మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి లేదా ఆ రాష్ట్ర మంత్రులు పాల్గొనడం కనీస మర్యాద అని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని అన్నారు.


More Telugu News