30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో చేసిన పొరపాటు, ఇప్పుడు అమరావతిలో చేయను: డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్

  • హైదరాబాద్‌లో నాడు పెట్టుబడి పెట్టకపోవటంపై రాజీవ్ సింగ్ ఆవేదన
  • ముప్పై ఏళ్ల క్రితం రాయదుర్గంలో భూములు కొనాలని సూచించిన చంద్రబాబు
  • సీఎం విజన్‌ను అంచనా వేయలేక గొప్ప అవకాశాన్ని కోల్పోయానన్న డీఎల్ఎఫ్ చైర్మన్
  • అమరావతి విషయంలో ఆ తప్పు మళ్లీ జరగనివ్వనని స్పష్టీకరణ
  • అమరావతి, విశాఖ నగరాల్లో పెట్టుబడులకు సీఎం ఆహ్వానం
"ముప్పై ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ విషయంలో చేసిన పొరపాటును.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో పునరావృతం కానివ్వను" అని ప్రముఖ రియల్ ఎస్టేట్, హౌసింగ్ సంస్థ డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాజీవ్ సింగ్ నేడు భేటీ అయ్యారు. ఢిల్లీలోని రైసినా డైలాగ్-2026 వేదిక వద్ద జరిగిన ఈ సమావేశంలో.. గత స్మృతులను, నాటి పెట్టుబడి అవకాశాలను రాజీవ్ సింగ్ గుర్తుచేసుకున్నారు.

దాదాపు మూడు దశాబ్దాల క్రితం చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా తనకు స్వయంగా సూచించారని రాజీవ్ సింగ్ గుర్తుచేశారు. అయితే, నాడు తాను చంద్రబాబు దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను సరిగ్గా అంచనా వేయలేకపోయానని అన్నారు. ఆనాడు సీఎం సలహా పాటించి ఉంటే.. నేడు ఎంతో లాభపడేవాళ్ళమని, ఓ గొప్ప పెట్టుబడి అవకాశాన్ని చేజార్చుకున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు విజన్, సైబరాబాద్ నిర్మాణంతో నేడు రాయదుర్గం ప్రాంతం దేశంలోనే ప్రముఖ ఐటీ, వాణిజ్య కేంద్రంగా మారిందని కొనియాడారు.

హైదరాబాద్ విషయంలో చేసిన పొరపాటును అమరావతి విషయంలో చేయదలచుకోలేదని రాజీవ్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీలో కొత్తగా నిర్మిస్తున్న రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు డీఎల్ఎఫ్ అత్యంత ఆసక్తిగా ఉందని ముఖ్యమంత్రికి తెలిపారు. త్వరలోనే అమరావతిని సందర్శించి, అక్కడ ఉన్న అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తానని వెల్లడించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. డీఎల్ఎఫ్ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రానికి రావడం శుభపరిణామమన్నారు. కేవలం అమరావతిలోనే కాకుండా.. విశాఖపట్నం అభివృద్ధిలోనూ భాగస్వామ్యం కావాలని రాజీవ్ సింగ్‌ను సీఎం కోరారు.

అమరావతి, విశాఖపట్నం నగరాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలు, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను ఈ సందర్భంగా డీఎల్ఎఫ్ చైర్మన్‌కు సీఎం వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాజీవ్ సింగ్ సుముఖత వ్యక్తం చేయడం పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.


More Telugu News